రెండేళ్ల హైడ్రా ప్రస్థానం నగర రక్షణకు కొత్త దిశ

రెండేళ్ల హైడ్రా ప్రస్థానం నగర రక్షణకు కొత్త దిశ

వనపర్తి, ఆగష్టు 25 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): నగరాన్ని వరదలు, అక్రమ ఆక్రమణలు, జలవనరుల విధ్వంసం నుంచి రక్షించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) రెండేళ్ల ప్రస్థానంలో గణనీయమైన ఫలితాలు సాధించింది. 2024 జూలై 19న ఏర్పాటైన హైడ్రా ఇప్పటివరకు 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. చెరువులు, వాగులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు నగరాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా తీసుకెళ్లే చర్యలను హైడ్రా చేపడుతోంది. వేగంగా విస్తరిస్తున్న నగరంలో చెరువుల ఆక్రమణలు, నాలాల కుదింపు, ప్రణాళిక లేని నిర్మాణాల కారణంగా వరదలు, నీటి ఎద్దడి వంటి సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. ఒకప్పుడు సహజ వరద నియంత్రణ వ్యవస్థగా పనిచేసిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ దెబ్బతినడంతో వర్షాకాలంలో స్వల్ప వర్షానికే అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు హైడ్రా చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణ, వర్షపు నీటి సహజ ప్రవాహ మార్గాల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
మొదటి దశలో బతుకమ్మకుంట, నల్లచెరువు, బమృకున్–ఉద్–దౌలా చెరువు, తమ్మిడికుంట, సున్నం చెరువు, ఉప్పల్ నల్లచెరువు సహా ఆరు చెరువులను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మరో 14 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నగర నాలుగు దిక్కుల్లో అంబీర్ చెరువు, ఫాక్స్ సాగర్, అమీన్‌పూర్ పెద్ద చెరువు, సరూర్‌నగర్ పెద్ద చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా తీర్చిదిద్దే పనులు కూడా చేపట్టింది. చెరువుల వద్ద పార్కులు, నడక మార్గాలు, బహిరంగ వ్యాయామ కేంద్రాలు, చిన్నారుల ఆట స్థలాలు ఏర్పాటు చేస్తూ వాటిని ప్రజలకు ఉపయోగపడే జీవన ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తోంది. హైడ్రా చేపట్టిన చర్యలతో నగరంలోని పలు ప్రాంతాల్లో వరద ముప్పు గణనీయంగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. అమీర్‌పేట, కృష్ణానగర్, ప్యాట్నీ, శ్రీరాంనగర్, తమ్మిడికుంట, గురునాథ్ చెరువు, ఖాజాగూడ చెరువు తదితర ప్రాంతాల్లో నాలాల పూడిక తొలగింపు, ఆక్రమణల నివారణ, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణ ద్వారా వర్షపు నీరు సాఫీగా వెళ్లే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. గతంలో వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది కుటుంబాలకు ఈ చర్యలతో ఉపశమనం లభించిందని వివరించారు.
అక్రమ ఆక్రమణల నిర్మూలనలో భాగంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు, రహదారులు, ప్రజావసరాలకు కేటాయించిన భూములను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇందులో 2,665 ఎకరాల ప్రభుత్వ భూమి, 454.11 ఎకరాల చెరువు భూమి, 90.39 ఎకరాల పార్కుల భూమి, 25.37 ఎకరాల నాలాలు, 62.18 ఎకరాల రహదారులు, ఫుట్‌పాత్‌లు, 26.31 ఎకరాల ప్రజావసరాల భూములు ఉన్నాయి. ఐలాపూర్, గాజులరామారం, కొండాపూర్, పీర్జాదిగూడ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బహదూర్‌గూడ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ప్రభుత్వ భూములను కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. నగరాన్ని వరదల నుంచి రక్షించడం, జలవనరులను పరిరక్షించడం, ప్రజా ఆస్తులను కాపాడడం, పర్యావరణ సమతుల్యతను నెలకొల్పడం వంటి లక్ష్యాలతో హైడ్రా తన కార్యాచరణను కొనసాగిస్తోంది. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పచ్చదనం పెంపు, ప్రజా అవసరాల కోసం భూముల వినియోగం వంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితమైన, సుస్థిరమైన హైదరాబాద్‌ను అందించాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.