Saturday, October 31, 2026

ఆరోగ్యంతెలంగాణ

టీబీ రహిత వనపర్తి లక్ష్యంగా ప్రత్యేక చర్యలు…

: డీఎంహెచ్‌వో డా. భాస్కర్ నాయక్

వనపర్తి, ఆగష్టు 18 ( రైజింగ్ సన్ న్యూస్) వనపర్తి జిల్లాలో ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. భాస్కర్ నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో క్షయ వ్యాధి నివారణతో పాటు దోమల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.  క్షయ వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి: టీబీ నోడల్ అధికారి డా. వంశీ, పీవో డా. మంజుల, సబ్ యూనిట్ ఆఫీసర్ ఓంప్రకాష్‌ల సమన్వయంతో జిల్లాలో క్షయ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానిత కేసులను గుర్తించి, పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన చికిత్స అందించాలని ఆదేశించారు. 

వారంలో రెండు రోజులు ‘ఫ్రైడే డ్రై డే’: జిల్లాలో దోమల నివారణ కోసం ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాన్ని ఇకపై ప్రతిమంగళవారం మరియు శుక్రవారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 

దోమల వృద్ధి కేంద్రాల తొలగింపు: ఇంటి పరిసరాలు, కార్యాలయాలు మరియు ఇతర ప్రాంతాల్లో వర్షపు నీరు లేదా వ్యర్థపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి, దోమలు పుట్టకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. 

అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ: ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ మరియు డీఎంహెచ్‌వో ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఫీల్డ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో విధిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హెచ్చరించారు. 

ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం: ‘టీబీ రహిత వనపర్తి’ జిల్లా ఆవిర్భావానికి, దోమల నివారణ ద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌వో ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీ నోడల్ అధికారి డా. వంశీ, పీవో డా. మంజుల, సబ్ యూనిట్ ఆఫీసర్ ఓంప్రకాష్, ఎంఎల్‌హెచ్‌పీలు (MLHP), సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love