Saturday, October 31, 2026

తెలంగాణజోగులాంబ గద్వాలనాగర్‌కర్నూల్నారాయణపేటమహబూబ్‌నగర్రాజకీయాలువనపర్తి

నవంబర్‌ 2న హరీష్‌రావు పర్యటన..

– ఎండిన వరిపంటల పరిశీలన.. రైతులకు భరోసా

– పట్టభద్రుల ఓటు నమోదుపై బీఆర్‌ఎస్‌ శ్రేణులకు నిరంజన్‌రెడ్డి దిశానిర్దేశం

రైజింగ్ సన్ న్యూస్ , వనపర్తి అక్టోబర్ 27: ఎండిన వరిపంటలను పరిశీలించి, సాగునీరు, విద్యుత్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పించేందుకు మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు నవంబర్‌ 2న పర్యటించనున్నారు. రైతులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని, వారిలో ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బలిజేపల్లి, జంగమాయపల్లి జంట గ్రామాలతో పాటు పామిరెడ్డిపల్లి, అంకూర్‌, వెంకటాపూర్‌, చికారు చెట్టు తండా, ముందరి తండా గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో హరీష్‌రావు పర్యటన ఏర్పాట్లు, రైతాంగ సమస్యలు, పట్టభద్రుల ఓటు నమోదుపై చర్చించారు.

విద్యుత్‌ సమస్యలకు ప్రభుత్వమే కారణం

సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలతో పాటు సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ ముందుచూపు లోపం, బొగ్గు సరఫరాలో నిర్లక్ష్యం కారణంగా విద్యుత్‌ కష్టాలు ఏర్పడ్డాయని విమర్శించారు.

సాగునీటి వినియోగంలో నిర్లక్ష్యం

జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు చేరినప్పటికీ, సరైన సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ), నార్లాపూర్‌ పంపులను ప్రారంభించకపోవడంతో నీటి వినియోగంలో జాప్యం జరిగిందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం శ్రీశైలంలో 60 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, అందులో 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఎద్దుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లను నింపితే పంటలకు సాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాలను పెంచవచ్చని సూచించారు. తాగునీరు, పశువుల నీటి అవసరాలకూ ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.

పట్టభద్రుల ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకునేందుకు సమయం తక్కువగా ఉన్నందున బీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రామాలవారీగా అర్హులైన పట్టభద్రులను ప్రత్యక్షంగా కలిసి ఓటు నమోదు చేయించాలని నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. ఈ ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

పర్యటన విజయవంతానికి పిలుపు

నవంబర్‌ 2న హరీష్‌రావు పర్యటన సాగే మార్గాన్ని నాయకులకు వివరించారు. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకునే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జగదీశ్వర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, వేణు యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రవిప్రకాష్‌రెడ్డితో పాటు సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *